అక్కడేమో కేంద్రమంత్రి మీడియా వాళ్లను ప్రాస్టిట్యూట్‌లతో పోలుస్తూ ఒక కొత్త వివాదానికి తెరతీస్తాడు. కానీ ఇక్కడ అస్సలు ఏమాత్రం ప్రచారం లోకి రాకుండా మరుగున పడిపోయిన విషయం ఏంటంటే.. మన తెలంగాణ యువ మంత్రి కేటీఆర్‌.. మీడియా వాళ్లను గోపికలతో పోలుస్తున్నాడు. నాయకులు కనపడగానే.. మీడియావాళ్లు ప్రత్యేకించి.. వారి విజువల్స్‌ తో అవసరం ఉండే టీవీ మీడియా వాళ్లు వారిని చుట్టుముట్టి వివరాలు అడగడం సహజం. ఇలాంటి వారిని కేటీఆర్‌ గోపికలు అంటూ అభివర్ణించడమే బాధాకరం. ఇంతకూ గోపికల మధ్య శ్రీకృష్ణుడు ఎవరో తెలుసా? తెలంగాణలోని మరో మంత్రిగారు!!

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అవగాహన రాహిత్యాన్ని, మాటల్లోని వ్యంగ్యాన్ని నిరూపించే ఈ ఉదంతం సెక్రటేరియేట్‌లోనే జరిగింది. 
నిత్యం వివాదాస్పద ప్రకటనలతో వార్తల్లో ఉండే ఒక మంత్రిగారు కనిపించిన వెంటనే.. సెక్రటేరియేట్‌లో మీడియా మిత్రులు సహజంగానే ఆయన చుట్టూ చేరారు. ఈలోగా అటువైపు మంత్రి కేటీఆర్‌ వచ్చారు. ఆయన మీడియా వారిని ఉద్దేశించి వ్యంగ్యంగా ‘‘ఏంటి మా కృష్ణుడి చుట్టూ గోపికల్లాగా చేరారే’’ అంటూ విసుర్లు వేశారు. హఠాత్తుగా వచ్చిన ఈ కామెంట్‌కు మీడియా మిత్రులు విస్తుపోవాల్సి వచ్చింది. ప్రెస్‌ వాళ్లని గోపికలు అంటూ హేళనగా మాట్లాడతారా అని వారు మధనపడ్డారు. 

మంత్రి అయిన తర్వాత ఆయన చుట్టూ చేరితే.. ఏదో కృష్ణుడిలాగా వెలిగిపోతూండవచ్చు గానీ.. వారి హవా మొదలుకాని రోజుల్లో ‘నా గురించి ఓసారి రాయి అన్నా’, ‘నన్ను ఓసారి టీవీలో చూపించు అన్నా’ అంటూ బతిమాలుతూ తిరిగేది ఈ నాయకులే! నిజానికి ప్రెస్‌వాళ్లు తలచుకుంటే ఎందుకూ పనికిరాని వాళ్లను కూడా నాయకులుగా చేసేసిన సందర్భాలు మనకు బోలెడు ఉన్నాయి. అలాంటిది.. మీడియా వాళ్లను ‘గోపికలు’ అంటూ హేళనగా మాట్లాడడం సరికాదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: